: లంబసింగిలో 'ఆంధ్రా ఆపిల్' ప్రయోగం సక్సెస్.. మరికొన్నేళ్లలో మార్కెట్లోకి ఆంధ్రా ఆపిల్స్!
కాశ్మీర్ ఆపిల్, సిమ్లా ఆపిల్ లాగా ఆంధ్రా ఆపిల్ పేరు కూడా మార్కెట్లో మారుమ్రోగే రోజులు మరెంతో దూరంలో లేవు. విశాఖ ఏజెన్సీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆపిల్ పంట సాగు దాదాపు విజయవంతమవడమే ఈ మాట అనడానికి కారణం. లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో తొమ్మిది నెలల క్రితం వేసిన ఆపిల్ మొక్కలు ఊహించని విధంగా ఏపుగా పెరుగుతుండడంతో హైదరాబాద్ సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మొక్కల పెరుగుదలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆపిల్ సాగుకు విశాఖ మన్యం చాలా అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. తొమ్మిది నెలల్లో ఎవరూ ఊహించని విధంగా మొక్కలు గుబురుగా, ఏపుగా సుమారు ఏడు అడుగుల ఎత్తు పెరిగాయి. తమ ప్రయోగం సక్సెస్ బాటలో నడుస్తుండడంతో శాస్త్రవేత్తలు సంతోషంగా ఉన్నారు. విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, అరకు ప్రాంతాలు ఉత్తర భారతదేశంలోని సిమ్లా, కులు, మనాలి ప్రాంతాల్లోని వాతావరణాన్ని పోలివుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు జీరో, మైనస్ డిగ్రీలు కూడా నమోదవుతుంటాయి. దీంతో, విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఆపిల్ సాగుకు అనుకూలంగా వుంటుందని హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు భావించారు. ఈ ప్రాంత వాతావరణంపై అధ్యయనం చేసి, పరిస్థితులు అనుకూలంగా కనిపించడంతో కార్యరంగంలోకి దిగారు. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో అన్న, మెహల్, సెలక్షన్ అనే రకాలకు చెందిన 60 ఆపిల్ మొక్కలను నాటారు. అదే విధంగా లంబసింగి సమీపంలో రాజుపాకల గ్రామం వద్ద మరో పది మొక్కలను నాటారు. ప్రస్తుతం ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో, ఈ ప్రాంతంలో మరిన్ని ప్రయోగాలకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఏజెన్సీలోని వాతావరణ పరిస్థితులు, మొక్కల ఎదుగుదలను మరింత అధ్యయనం చేసిన తర్వాత ఏటా రెండు కాపులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.