: విశాఖ వ్యాపారి నుంచి రూ.3 కోట్లు దోచేసిన చంద్రస్వామి ఆశ్రమం
వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి ఆశ్రమం విశాఖకు చెందిన ఓ వ్యాపారిని రూ.3 కోట్ల మేర నిలువు దోపిడీ చేసింది. తన వద్ద ఉన్న ఖరీదైన రత్నాలను విక్రయించేందుకు యత్నిస్తున్న విశాఖ వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను చంద్రస్వామి అనుచరులు మోసం చేసి, ఆయన వద్దనున్న రూ.3 కోట్ల విలువ చేసే రత్నాలను కాజేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణకు హాజరు కావాలని చంద్రస్వామి, ఆయన అనుచరులకు నోటీసులు జారీ చేశారు. సంజయ్ ఫిర్యాదు ప్రకారం... తనవద్ద ఉన్న విలువైన రత్నాలను విక్రయించేందుకు సంజయ్ గత నెల 12న ఢిల్లీకి వచ్చారు. పలుచోట్ల వాటిని విక్రయించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఆదేశ్ వర్మ అనే వ్యక్తి, సంజయ్ ని గత నెల 18న చంద్రస్వామి ఆశ్రమం విశ్వ ధర్మయాతన్ సనాతన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ సునీల్ జైన్, పాండేలనే అనే ఇద్దరు వ్యక్తులను వర్మ పరిచయం చేశాడు. సంజయ్ వద్దనున్న 1,210 రత్నాలను చంద్రస్వామికి చూపించి తీసుకురమ్మని జైన్, పాండేకు సూచించాడు. తాను కూడా వెళతానన్న సంజయ్ ను వర్మ వారించాడు. ఆశ్రమం కోట్ల రూపాయల విలువ చేసేదని, అయినా స్వామి ఎవరినీ కలవరని చెప్పి అక్కడే కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్లిన పాండే ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఈలోగా సంజయ్ తో వచ్చిన వర్మ కూడా చిన్నగా జారుకున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సంజయ్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.