: ఎందరు ఓదార్చినా ఆమె ఏడుపు ఆపలేదు... పతకం తిరస్కరించింది!


ఆసియా క్రీడల్లోనే కాదు... ఏ క్రీడల్లోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకుని ఉండదు. భారత కీర్తిపతాకను వినువీధుల్లో ఎగురేసే క్రమంలో విజయం సాధించానని భావించిందా భారత బాక్సర్. అయితే, పతకం విషయంలో తనకు జరిగిన అన్యాయంపై నిర్వాహకులను నిలదీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో బేలగా మారింది. చిన్నపిల్లలా తన అసహాయతకు గుక్క పట్టి ఏడ్చింది. ఎంత మంది ఓదార్చినప్పటికీ భారత బాక్సర్ సరితా దేవి ఏడుపు ఆపలేకపోయింది. వివరాల్లోకి వెళితే... మహిళల 60 కేజీల బాక్సింగ్ క్రీడాంశం సెమీ ఫైనల్ బౌట్ లో సరితా దేవి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆటను చూసిన వారే కాకుండా, కామెంటేటర్లు కూడా సరితా దేవి విజయం సాధించిందని భావించారు. కానీ అనూహ్యంగా ఆమె ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు న్యాయనిర్ణేతలు. దీంతో, సరితా దేవి తనకు జరిగిన అన్యాయాన్ని అంపైర్ వద్ద ప్రస్తావించింది. అప్పీల్ చేసింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో, మనస్తాపానికి గురైన సరితా దేవి కాంస్య పతకధారణ సమయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆమె ఏడుస్తూ కాంస్య పతకాన్ని చేతుల్లోకి తీసుకుంది. దీంతో సెమీస్ లో ఆమె ప్రత్యర్ధి జీనా పార్క్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేసింది కూడా. తనకు ఎవరి మీదా కోపం లేదని సరిత ప్రకటించింది. న్యాయ నిర్ణేతల తీరు సమంజసం కాదని, ఇలాంటి ఫలితాలు క్రీడాకారుల ప్రతిభపై ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొంది. తనకు వచ్చిన పతకాన్ని కూడా రజత పతక విజేత జీనా పార్క్ కు ఇచ్చేసింది ఈ అభిమానవతి. దీంతో ఏం చేయాలో పాలుపోని జీనా పార్క్ పతకాన్ని పోడియంపై వదిలేసి వెళ్లిపోయింది. దీంతో, నిర్వాహకులు కాంస్యపతకం తమవద్దే ఉంచుకున్నారు. ఏడాదిన్నర బాబును కూడా పక్కన పెట్టి ఆసియా క్రీడల కోసం కఠోర సాధన చేశానని, ఒక దశలో తన కుమారుడు కూడా తనను గుర్తు పట్టలేదని సరిత తెలిపింది. తన ప్రదర్శన సరిగా లేకపోతే దానికి తాను అంగీకరించేదాన్నని, అలా కాకుండా తన ప్రతిభను తక్కువ చేసే ప్రయత్నం న్యాయనిర్ణేతలు చేశారని ఆమె వాపోయింది. తనకు పతకం అక్కర్లేదు కనుకే పతకాన్ని కొరియన్లకు ఇచ్చేశానని ఆమె స్పష్టం చేసింది. తరువాత ఎదురయ్యే ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. కాగా, సరిత భర్త ఈ వ్యవహారంలో తన భార్యకు పూర్తి మద్దతు తెలిపారు.

  • Loading...

More Telugu News