: నిర్మాత బండ్ల గణేష్ కు నోటీసులు జారీచేసిన బంజారాహిల్స్ పోలీసులు
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బంజారాహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్ ధర్మచరణ్ తులసీ 2011లో 80 లక్షల రూపాయలను నిర్మాత బండ్ల గణేష్ కు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కులు తనకు చెందాల్సి ఉండగా, నిర్మాత గణేష్ మరో వ్యక్తికి హక్కులు విక్రయించి ఛీటింగ్ కు పాల్పడ్డారని ధర్మచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, పోలీసులు బండ్ల గణేష్ కు నోటీసులు జారీ చేశారు. ధర్మచరణ్ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని వారు నోటీసులో పేర్కొన్నారు. గణేష్ పరారీలో ఉండడంతో, అతనిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేశారు. నోటీసులకు నిర్మాత స్పందించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.