: భారత్ లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ డేటా సెంటర్: సత్య నాదెళ్ల ప్రకటన
సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, తన క్లౌడ్ డేటా సెంటర్ ను భారత్ లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఢిల్లీలో ప్రకటించారు. 2015 నాటికి ఈ సెంటర్ ఏర్పాటును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. దీనిని ‘2 ట్రిలియన్ ఆపర్చునిటీస్’గా అభివర్ణించిన సత్య నాదెళ్ల, భారత ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంతో పాటు కార్పొరేట్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో కలసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. 25 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. క్లౌడ్ సేవల రంగంలోని ఇతర సంస్థలు గూగుల్, అమెజాన్ లు ఇప్పటి దాకా తమ డేటా కేంద్రాలను భారత్ లో ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 13, గూగుల్ కు 12, అమెజాన్ కు 8 డేటా సెంటర్లున్నాయి. తాజాగా భారత్ లో క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించడంతో గూగుల్, అమెజాన్ లు కూడా తమ డేటా సెంటర్లను ఇక్కడ నెలకొల్పే అవకాశాలు లేకపోలేదు.