: చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించండి: సచిన్
పిన్న వయసులోనే ప్రతిభను గుర్తించేందుకు, పెంచి పోషించేందుకు భారతదేశంలో ఓ వ్యవస్థ లేకపోవడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు జాప్యం అవుతుందంటున్నాడు. ఈ మేరకు ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ కేరళ బ్లాస్టర్స్ జట్టు గీతం, జెర్సీ ప్రారంభం సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, "చాలా దేశాల్లో చిన్న వయసులోనే ప్రతిభను గుర్తిస్తున్నారని అనుకుంటున్నాను. అదే భారతదేశంలో లోపించిందని భావిస్తున్నా. మనం టాలెంట్ ను గుర్తించినప్పటికే వారు టీనేజ్ కి వచ్చేస్తారు. అంతర్జాతీయ మ్యాచ్ లలో పోటీపడటానికి అప్పటికే చాలా ఆలస్యమవుతుంది" అని అభిప్రాయపడ్డాడు. అయితే, స్థానిక ప్రతిభను తప్పకుండా ప్రోత్సహిస్తామని ఈ క్రికెట్ లెజెండ్ స్పష్టం చేశాడు.