: భారీ జరిమాన... జయలలితను బయట పడేయనుందా?
ముఖ్యమంత్రి హోదాలో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, కేసు నుంచి సులువుగానే బయపడనున్నారా? అంటే, అవుననే అంటున్నారు ప్రముఖ న్యాయవాదులు. జయలలితను దోషిగా ప్రకటిస్తూ పరప్పణ అగ్రహార ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా వెలువరించిన తీర్పే, ఆమెను బయటపడేస్తుందని వారు వాదిస్తున్నారు. రూ.66.65 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించిన జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన డికున్హా, జరిమానాగా రూ.100 కోట్టు చెల్లించాలని తీర్పు చెప్పారు. జరిమానా కట్టని పక్షంలో మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 16 ప్రకారం, అందివచ్చిన అధికారాన్ని ఆసరా చేసుకుని అక్రమాస్తులు కూడబెట్టి, దోషులుగా తేలిన వారిపై, వారు సంపాదించిన దానికంటే అధికంగా జరిమానా విధించరాదు. అయితే ఈ కేసులో రూ.66.65 కోట్లు మాత్రమే జయలలిత అక్రమంగా ఆర్జించారు. మరోవైపు జయలలిత ఆస్తుల విలువ రూ.53.6 కోట్లేనని సాక్షాత్తు న్యాయమూర్తి డికున్హానే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జయలలితపై రూ.100 కోట్ల జరిమానా అన్నది చెల్లదన్న వాదన వినిపిస్తోంది. కర్ణాటక హైకోర్టులో జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లోనూ, ఆమె తరఫు న్యాయవాదులు ఈ అంశాన్నే ప్రధానంగా పేర్కొన్నట్లు సమాచారం. రేపటి వాదోపవాదాల్లోనే ఈ అంశంపైనే వారు ప్రధానంగా జయలలిత తరఫున పోరు సాగించనున్నట్లు తెలుస్తోంది.