: తిరుపతి నుంచి తిరుమలకు మోనోరైల్!
వేంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి చేరుకుంటే చాలు, అక్కడి నుంచి స్వామి వారి సన్నిధానం తిరుమలకు తీసుకెళ్లేందుకు మోనోరైల్ సిద్ధంగా ఉంటుంది. త్వరలో కార్యరూపం దాల్చనున్న ఈ ప్రాజెక్టుపై తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) శరవేంగంగా చర్యలు చేపడుతోంది. దాదాపు రూ.9 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ ను తుడా, కేంద్రం పరిశీలనకు పంపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించనున్నట్లు తుడా ప్రణాళికా విభాగం అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, కేవలం 25 నిమిషాల్లో తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవచ్చు. అంతేకాక ఒకేసారి 300 మందిని మోనోరైలు కొండపైకి సునాయసంగా తీసుకెళ్లనుంది. తిరుపతి ఆర్టీసీ బస్సు స్టేషన్ నుంచి మొదలయ్యే ఈ మోనోరైలు, అలిపిరి, కపిలతీర్థం వద్దనున్న భక్తులను కూడా ఎక్కించుకుని దూసుకెళ్లనుంది. ప్రయాణ కాలాన్ని పెద్దగా తగ్గించకున్నా, మోనోరైలుతో ఘాట్ రోడ్డులో ప్రమాదాలకు చెక్ పడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్లో 80 శాతం కేంద్రం భరించనుండగా, మిగిలిన నిధులను తుడా సమకూర్చనుంది. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండే ఈ ప్రాజెక్టు త్వరగా పట్టాలెక్కేలా చర్యలు తీసుకోనున్నట్లు తిరుపతి ఎంపీ వరప్రసాధ్ చెబుతున్నారు.