: శ్రీలేఖ బాణీలకు 'క్రికెట్ దేవుడు' క్లీన్ బౌల్డ్
టాలీవుడ్ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ సంగీతం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను సమ్మోహితుడిని చేసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ పోటీల్లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీకి సచిన్ సహ యజమాని అన్న సంగతి తెలిసిందే. కాగా, కేరళ బ్లాస్టర్స్ జట్టు ప్రచారం కోసం కొన్ని థీమ్ సాంగ్స్ ను రూపొందించారు. ఆ పాటలన్నింటిలోనూ ఎంఎం శ్రీలేఖ స్వరపరిచిన గీతమే సచిన్ బాగా ఆకట్టుకుంది. దీంతో, ఆ పాటనే ఖరారు చేయాల్సిందిగా చెప్పారు. కొచ్చిలో సోమవారం జరిగిన థీమ్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ... శ్రీలేఖ అందించిన సంగీతం స్ఫూర్తిదాయకంగా ఉందని సచిన్ కితాబిచ్చారు. 75 సినిమాలకు సంగీతం అందించడం మామూలు విషయం కాదని, భవిష్యత్తులో శ్రీలేఖ సెంచరీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు సచిన్ పేర్కొన్నారు. సచిన్ వ్యాఖ్యలపై శ్రీలేఖ స్పందిస్తూ... చిన్నప్పటి నుంచి తాను సచిన్ అభిమానినని తెలిపారు. తన పాటను సచిన్ ఆవిష్కరించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ పాటను వేదికపై శ్రీలేఖతో కలిసి విలక్షణ నటుడు కళాభవన్ మణి ఆలపించారు.