: భారత సరిహద్దుకు సమీపంలో చైనా జలాంతర్గామి
నిన్న భూతల సరిహద్దు... నేడు సముద్రతల సరిహద్దు! చైనా సైన్యం భారత సరిహద్దుపై నిఘా పెట్టడంతో పాటు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్న క్రమంలో ఇదో కొత్త ఉదంతం. భారత సరిహద్దుకు సమీపంలో హిందూ మహా సముద్ర జలాల్లో చైనా నావికాదళానికి చెందిన భారీ జలాంతర్గామిని భారత నావికా దళం గుర్తించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా సబ్ మెరైన్ భారత సరిహద్దు జలాలకు అతి సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ జలాంతర్గామి, శ్రీలంక సరిహద్దుకు చెందిన సముద్రతలంపై ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. భారత నిఘా వర్గాలు గుర్తించిన ఈ జలాంతర్గామి నుంచి గగనతలంపైకి క్షిపణులను ప్రయోగించే వీలుంది. ఇటీవలే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ శ్రీలంకలో పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన తర్వాత ఆ దేశ నౌక శ్రీలంక జలాల్లో భారత సరిహద్దుపై నిఘా వేసినట్లుగా సంచరిస్తుండటంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి.