: ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలి: ఐరాస వేదికపై మోడీ


ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు జరగడం లేదు కాని... ఉద్రిక్త వాతావరణం మాత్రం ఎదుర్కొంటున్నామని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వేదికపై మోడీ అన్నారు. గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవడానికి తాము పాక్ తో చేతులు కలపడానికి కూడా సిద్ధమయ్యామని తెలిపారు. పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలనే కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పాక్ కూడా తనవైపు నుంచి అదే రీతిలో సహకారం అందించాలని కోరారు. ఉగ్రవాదం ఎలా విస్తరిస్తుందో ప్రపంచం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోందని అన్నారు. ఇప్పటికీ కొన్ని దేశాలు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాదం పీచమణచడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వరదలతో అతలాకుతలమైన కాశ్మీర్ కు చేయూత అందిస్తున్నామని... పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీరీలకు కూడా సాయం చేస్తామని చెప్పామని మోడీ అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం మనమందరం కలసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఐక్యరాజ్య సమితి వంటి మంచి వేదిక ఉన్నప్పటికీ... జీ-7, 8, 20 వంటి ఇతర వేదికలు కూడా కనిపిస్తున్నాయని... అందరికీ ఒకే వేదిక ఉండాలని అన్నారు. ప్రపంచంలోని దేశాలు గ్రూపులు కట్టడం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రపంచమంతా వసుధైక కుటుంబం అనే భావన భారత్ మూలాల్లోనే ఉందని తెలిపారు. 125 కోట్ల ప్రజల ఆకాంక్షను తాను వ్యక్తీకరిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News