: సినిమాలపై వెంకయ్యనాయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పటి సినిమాల్లో విషయం ఉండడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలో డీడీ సప్తగిరి ఛానెల్ ప్రారంభించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, అప్పట్లో... సినిమాల్లో సాహిత్య విలువలు, నటనా కౌశలం కొట్టొచ్చినట్టు కనిపించేవని అన్నారు. తమ నటనా కౌశలంతో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్, సావిత్రి వంటి వారు మహానటులుగా ఎదిగారని అన్నారు. ఇప్పుడు అలాంటి నటులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి సినిమాల్లో హంగామా ఎక్కువైందని ఆయన తెలిపారు. సినిమాల్లో హింసను తగ్గించాలని ఆయన సలహా ఇచ్చారు. పాత తరం సినిమాల్లో హీరో ఓ దెబ్బేస్తే విలన్ కూడా కొట్టేవాడని, చివరికి హీరోది పైచేయి అయినప్పటికీ సన్నివేశం ఆకట్టుకునేదని ఆయన తెలిపారు. అదే ఇప్పటి సినిమాల్లో హీరో ఎగరేసి కొడుతుంటే, విలన్ ఆ దెబ్బలను కాస్తూనే ఉంటాడని ఎద్దేవా చేశారు. ఏంటీ, వైపరీత్యమని ఆయన ప్రశ్నించారు. సినిమాల్లో తెలుగు చూస్తుంటే చాలా బాధేస్తోందని ఆయన తెలిపారు. మాతృ భాషను ప్రేమించలేకపోతే సినిమాలు ఆడవన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. తెలుగు భాషను అద్భుతంగా వినియోగించుకుని సంభాషణలు రాయవచ్చని ఆయన స్పష్టం చేశారు. రచయితలకు సాహిత్యాభిలాష ఉండాలని, ఆకట్టుకునే సంభాషణలు రాయగలిగితే మంచి జీవితం ఉంటుందని ఆయన తెలిపారు. అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే, చివరికి ఆ అభిమానులకు కూడా మీ సినిమాలు నచ్చవని ఆయన తెలిపారు. టీవీ మీడియా విజ్ఞానం పెంపొందించుకునేందుకు, ఆనందంగా ఉంచేందుకు నిబద్ధతతో పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. దూరదర్శన్ లో దేశ వ్యాప్తంగా మొత్తం 1417 ట్రాన్స్ మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రేటింగుల వెంట పరుగెత్తకుండా, మంచి కార్యక్రమాలు రూపొందించాలని ఆయన సూచించారు. వివాదాస్పద అంశాల జోలికెళ్లకుండా, సత్యాన్ని ప్రచారం చేయాలని ఆయన అన్నారు. వార్తను వార్తగా చూపించాలి, వ్యాఖ్యానం వ్యాఖ్యంగా చూపించాలని ఆయన హితబోధ చేశారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.