: జయలలిత భవిష్యత్తుపై ఊహాగానాల వెల్లువ!
అక్రమాస్తుల కేసులో నిందితురాలుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భవితవ్యం నేడు తేలిపోనుంది. 1996లో ఆమెపై నమోదైన కేసులో నేడు బెంగళూరులోని ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది, జయలలిత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనబోతున్నారన్న అంశాలపై ఆసక్తికరంగా చర్చలు కొనసాగుతున్నాయి. కేసులో జయలలిత నిర్దోషిగా తేలితే, తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే జయలలితను కోర్టు దోషిగా ప్రకటిస్తే, రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా భారీ కుదుపునకు గురి కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. జయలలితను కోర్టు దోషిగా ప్రకటిస్తే, రెండు రకాలైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో జయలలిత దోషిగా తేలితే, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడంతో పాటు తన ఎమ్మెల్యే పదవిని కూడా జయలలిత కోల్పోతారు. తన మంత్రివర్గం కూడా రద్దవుతుంది. తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం లభిస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే తీర్పు వెలువడిన వెంటనే ఆమె జైలుకెళ్లే అవకాశాలు లేవు. అలాకాక అప్పీలు కోసం అనుమతి లేకపోతే, తీర్పు వెలువడిన మరుక్షణమే జయలలిత నేరుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, జయలలిత సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే హోదా క్షణాల్లో రద్దవుతాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు తదనంతర పరిణామాలపై భారీ స్థాయిలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో తమిళనాడుతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో భద్రత కట్టుదిట్టమైంది. బెంగళూరులో శనివారం ఉధయం నుంచే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.