: భూసేకరణలో రైతులు లబ్ది పొందేలా చేస్తాం: ఏపీ మంత్రివర్గ ఉపసంఘం
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం చేపడుతున్న భూసేకరణలో రైతులకు ప్రయోజనం దక్కేలా చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలో రైతులకు 10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గ కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని, ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి నారాయణ చెప్పారు. గాంధీనగర్ లో అభివృద్ధి చేసిన భూముల్లో 25 శాతం ఇవ్వగా, నయా రాయ్ పూర్ లో 35 శాతం ఇచ్చారని తెలిపారు. ఏపీలో ఎంత భూమి ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. తొలి దశలో ఆరు నెలల్లోపు భూమి సేకరించడం లక్ష్యమని, ఈ సమయంలో 25 వేలు ఎకరాలు సేకరించి మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మొత్తం రాజధాని నిర్మాణానికి నాలుగు దశల్లో లక్ష ఎకరాలు సేకరిస్తామని నారాయణ చెప్పారు. వీజీటీఎం పరిధిలోనే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు.