: కాళీమాత రూపంలో బార్బీ బొమ్మలు... చెలరేగిన దుమారం
అర్జెంటీనాకు చెందిన మారియానెలా పెరెల్లీ, పూల్ పావోలిని అనే కళాకారులు బార్బీ బొమ్మలను కాళీమాత రూపంలోనూ, ఇతర మతాలకు చెందిన దేవతల రూపంలోనూ డిజైన్ చేశారు. అక్టోబర్ 11 నుంచి బ్యూనస్ ఎయిర్స్ లో ప్రారంభమయ్యే ఓ ఎగ్జిబిషన్ లో వాటిని ప్రదర్శించనున్నారు. ఆ కలెక్షన్ కు 'బార్బీ-ద ప్లాస్టిక్ రెలిజియన్' అని పేరు పెట్టారు. ఈ కొత్త తరహా బార్బీ బొమ్మలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. వివిధ మతాలకు చెందిన ప్రముఖలు వీటి రూపకర్తలపై మండిపడుతున్నారు. రాజన్ జేద్ అనే ఇండో-అమెరికన్ హిందూ మతగురువు మాట్లాడుతూ, హిందూమతాన్ని ప్రతిబింబించే కళారూపాలను తాము స్వాగతిస్తామని, కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిందుత్వ సిద్ధాంతాలు, ప్రతీకల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కాళీమాత రూపంలో బార్బీ బొమ్మ రూపొందించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి వాటి కారణంగా భక్తుల మనోభావాలు గాయపడతాయని అన్నారు. రాజన్ జేద్ గతంలో అమెరికా సెనేట్ లో ప్రార్థనలు నిర్వహించారు.