: మోడీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి కాదు... ఫస్ట్ ట్రిప్ వివరాలు ఇవే
నరేంద్రమోడీ ప్రధాని కాకముందు నుంచి కూడా ఓ వార్త ప్రముఖంగా వినిపిస్తూ ఉండేది. అదే... 'మోడీకి వీసా నిరాకరించిన అమెరికా'! దీంతో, ఇంత వరకు మోడీ అమెరికాకు వెళ్లలేదనే చాలా మంది భావించారు. కానీ, అసలు విషయం ఏమిటంటే... 20 ఏళ్ల క్రితమే (1994 జులై) ఆయన అగ్ర రాజ్యాన్ని చుట్టేశారు. అది కూడా అమెరికా ఆహ్వానం మేరకే అప్పట్లో మోడీ అమెరికా వెళ్లారు. ఏకంగా 30 రోజుల పాటు అమెరికాలోనే గడిపారు. మోడీ తొలి అమెరికా యాత్ర ఏ విధంగా సంభవించిందంటే... 1994లో మన దేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు ఓ అధ్యయన యాత్రను చేపట్టారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా... మిగిలిన వారు బీజేపీకి చెందిన వారు. బీజేపీ తరపున ప్రస్తుత ప్రధాని మోడీ, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్ర మంత్రి అనంతకుమార్ ఈ పర్యటనకు ఎంపికయ్యారు. 41 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో వీరంతా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించారు. తొలుత ఫ్రాన్స్ పర్యటించిన అనంతరం 'అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్' అధికారిక ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లారు. ఈ వివరాలను స్వయంగా కిషన్ రెడ్డే వెల్లడించారు. అప్పట్లో నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. కిషన్ రెడ్డి బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేసేవారు. అమెరికా పర్యటనలో వీరంతా ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ అమెరికాలోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి స్పేస్ సెంటర్ ను చూసి మన దేశం ఈ స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందో అని బాధపడ్డారట. అలాగే, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని కూడా నిశితంగా పరిశీలించారట. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఎలా తయారయిందనే విషయంపై ఎక్కువగా దృష్టి సారించారట. ఇదండీ సంగతి! గోద్రా అల్లర్ల తర్వాత మోడీకి వీసా నిరాకరించిన అమెరికా... అంతకు ముందే ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... తొలి అమెరికా పర్యటనలో అద్వానీ ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ క్లీన్ గా షేవ్ చేసుకుని అగ్రరాజ్యానికి వెళ్లారు.