: పరకాలకు చెవిరెడ్డి సవాలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మండిపడ్డారు. తన తండ్రి వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి ఎక్కడైనా ఒక్క రూపాయి పింఛను తీసుకున్నట్టు ఆధారాలు చూపగలరా? అని నిలదీశారు. దేవుడి దయవల్ల తనకు పింఛను తీసుకునే స్థాయిలేదని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి వృద్ధాప్య పింఛన్ పై బహిరంగ చర్చకు సిద్ధమా? అని పరకాలకు చెవిరెడ్డి సవాలు విసిరారు. తాను ముఖ్యమంత్రి జిల్లా నుంచి గెలవడం వల్లే తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తెలిపారు. గతంలో బాబుపై చేసిన ఆరోపణలకు పరకాల కట్టుబడి ఉన్నారా? అని ఆయన అడిగారు. డబ్బు కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో పరకాల జైలుకు కూడా వెళ్లారని చెవిరెడ్డి చెప్పారు.