: ముస్లింలపై ప్రధాని ప్రకటనపై నాకు అనుమానాలున్నాయి!: అసదుద్దీన్ ఒవైసీ


"భారతదేశంలో ముస్లింలు దేశం కోసం జీవిస్తారు, అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తారు" అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని రోజుల కిందట వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఆంగ్ల పత్రిక ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందన కోరింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, "గత పదేళ్ల నుంచి అమెరికా వెళ్లే ప్రతి ప్రధానమంత్రి ఇదే విషయాన్ని చాలా బలవంతంగా మాట్లాడుతున్నారు. అప్పట్లో యూఎస్ వెళ్లిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కూడా భారతీయ ముస్లింల గురించి ఓ ప్రకటన చేశారు. నా ప్రశ్న ఏంటంటే, పీఎం అలా అనుకున్నప్పుడు ఆయన పార్టీ ఎందుకు ముస్లింలపై దాడిచేసే విధంగా సంకేతాలు ఇస్తుంది? గుజరాత్ జైళ్లలో ఇప్పటికీ అనేకమంది ముస్లింలు ఎందుకు ఉన్నారు? ముస్లింలు ఎప్పుడూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోలేదు. కానీ, ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రకటనపై నాకు అనుమానాలున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఎందుకన్నారో కచ్చితంగా చెప్పలేను. ఇంత ఆలస్యంగా పీఎం ఎందుకు రియలైజ్ అయ్యారో లేక అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి ప్రకటన చేశారో తెలియదు" అని ఒవైసీ పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ముంబయిలో పర్యటించారు.

  • Loading...

More Telugu News