: కోతిని ఆడిస్తూ, గంగలో మునకేస్తూ... ట్విట్టర్లో ఫెదరర్ 'భారతీయం'!


టెన్నిస్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ గా పేర్కొనే స్విట్జర్లాండ్ స్టార్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ఇప్పుడు భారత్ అంటే విపరీతమైన అభిమానం కనబరుస్తున్నాడు. అందుకు కారణం లేకపోలేదు. భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) లో ఫెదరర్ 'టీమ్ ఇండియా'కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ వరల్డ్ చాంపియన్ షిప్ లో కొన్ని పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తోంది. పైగా తాను ప్రాతినిధ్యం వహిస్తోంది భారత ఫ్రాంచైజీకే. ఇంకేముంది, ఈ స్విస్ కెరటాన్ని భారతీయం ఆవహించింది! ట్విట్టర్లో తన ఫొటోలను భారతీయత నేపథ్యంలో మార్ఫింగ్ చేయాలని అభిమానులకు సూచించాడు. దీంతో, ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఫెదరర్ ను వివిధ అంశాలతో మిక్స్ చేసి పలు ఫొటోలు పోస్టు చేశారు. వాటిలో... ఓ చోట భారత మహిళల హోలీ ఉత్సవంలో రాకెట్ చేబట్టిన ఫెదరర్ కనిపిస్తాడు. మరో దాంట్లో కోతిని ఆడిస్తూ నవ్వు తెప్పిస్తాడు. టీమిండియా క్రికెటర్ వేషంలోనూ, ఆటోవాలా గానూ దర్శనమిస్తాడీ చాంపియన్ ప్లేయర్. అంతేకాదండోయ్, అమ్మాయిలా మెహెందీ పెట్టించుకుంటూ, గంగలో మునకేస్తూ, తాజ్ మహల్ ముందు చిరునవ్వుతో పోజిస్తూ, బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ తో స్టెప్పులేస్తూ... ఇలా పలు రకాలుగా దర్శనమిస్తాడు. తన ఫొటోలపై ఫెదరర్ ట్విట్టర్లో స్పందిస్తూ, అద్భుతంగా ఉన్నాయని, అభిమానులు ఎంతో సృజనాత్మకంగా వాటిని రూపొందించారని ప్రశంసించాడు.

  • Loading...

More Telugu News