: ఢిల్లీలో ప్రారంభమైన మోడీ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం... హాజరైన 500 మంది సీఈవోలు
ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' క్యాంపెయిన్ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మొదలైంది. భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. భారత్ ను ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా మలిచే బృహత్తర లక్ష్యంతో 'మేక్ ఇన్ ఇండియా'కు మోడీ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దేశంలోని అగ్రస్థాయి పారిశ్రామికవేత్తలైన అనిల్ అంబానీ, కుమార మంగళం బిర్లా, సైరస్ మిస్త్రీ, అదానీ, హిందుజా, అజీం ప్రేమ్ జీ, కిరణ్ మజుందార్ షా తదితరులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలకు చెందిన 500 మంది సీఈఓలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 'మేక్ ఇన్ ఇండియా' ఒక నినాదం కాదని... దేశాభివృద్ధి కోసం ఎంతో తపనతో చేపట్టిన ఒక బృహత్ కార్యక్రమమని తెలిపారు.