: ఇకపై చిన్నారులూ బ్యాంక్ చెక్ లపై సంతకాలు చేయొచ్చు
ఇప్పటిదాకా చెక్కులపై సంతకాలు చేయడం పెద్దలకే పరిమితం. అయితే ఈ పరిమితికి స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ తిలోదకాలిచ్చేశాయి. ఇకపై పదేళ్ల బాలలు కూడా చెక్ లపై సంతకాలు చేసేందుకు ఆ బ్యాంకింగ్ దిగ్గజాలు మార్గం సుగమం చేశాయి. పదేళ్ల బాలలకు బ్యాంకు అకౌంట్లతో పాటు ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. పిల్లల్లో పొదుపు మంత్రాన్ని పెంపొందించేందుకు అన్ని బ్యాంకులు చొరవ చూపాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలను ఆ బ్యాంకులు అమలు చేయనున్నాయి. ఇప్పటికే ‘పెహ్లా కదమ్’, ‘పెహ్లీ ఉదాన్’ పేరిట ఎస్బీఐ ఈ దిశగా చర్యలను మొదలు పెట్టగా, తాజాగా ‘స్మార్ట్ స్టార్స్’ పేరిట ఐసీఐసీఐ, పిల్లలకు బ్యాంకు అకౌంట్ల జారీకి శ్రీకారం చుట్టింది. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఏటీఎం, చెక్ బుక్ సౌకర్యం కల్పిస్తున్న ఈ రెండు బ్యాంకులు, తమ చిన్నారి ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని మాత్రం నిరాకరించాయి. పొదుపు మంత్రాన్ని పిల్లలకు నేర్పడం మంచిదైనా, వారికి అప్పులు చేయడం నేర్పడం మంచిది కాదు కదా? అన్న సదరు బ్యాంకుల నిర్ణయాలు సర్వత్ర హర్షణీయమే.