: సెంట్రల్ వర్సీటీ భూముల్లో తెలంగాణ పరేడ్ గ్రౌండ్?
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) భూములపై పాలకుల దాహార్తి ఇంకా తీరనట్టుంది. గడచిన ఐదేళ్లలో పలు మార్లు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల భూములను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోగా, తాజాగా తెలంగాణ పాలన పగ్గాలను దక్కించుకున్న కేసీఆర్ కూడా వర్సిటీ స్థలాలపై కన్నేశారు. వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను సేకరించి, అందులో తెలంగాణ పరేడ్ గ్రౌండ్ ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం కార్యాలయం ఇటీవల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సంబంధిత రెవెన్యూ అధికారులు వర్సిటీలోని ఏ ప్రాంతమైతే బాగుంటుందన్న అంశంపై ఆరా తీస్తున్నారట. అయినా స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు, రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ లను నిర్వహించుకునేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ అందుబాటులోనే ఉంది. అంతేకాక తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరువగానే ఉంది. కొత్తగా సెంట్రల్ వర్సిటీలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటుతో కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అధికారులు తప్పితే, సామాన్యులు దూరాభారాన్ని ఎదుర్కోక తప్పదు. అందులోనూ సెంట్రల్ వర్సిటీలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నది విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖుల వాదన. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ వర్సిటీ భూములను తీసుకోగా లేనిది, తానెందుకు తీసుకోకూడదన్న భావనతోనే కేసీఆర్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎంతసేపూ సెంట్రల్ వర్సిటీ భూములపై కన్నేస్తున్న పాలకులు, దేశ, విదేశీ విద్యార్థులకు ఆలవాలమైన వర్సిటీ భూములు తగ్గిపోతున్నాయన్న కోణంలో ఆలోచన చేయకపోవడం విడ్డూరమే.