: చంద్రబాబుకు మరింత భద్రత!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతను మరింత పెంచుతూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు కార్యాలయం సెక్రటేరియట్ లోని ఎల్ బ్లాకుకు మారిన సంగతి తెలిసిందే. ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్తులో చంద్రబాబుకు కార్యాలయం సిద్ధమైంది. చంద్రబాబు కార్యాలయం ఏర్పాటైన గది, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కు అభిముఖంగా ఉన్న రోడ్డుకు అతి సమీపంగా ఉంది. సచివాలయానికి ఎదురుగా ఉన్న అమృత క్యాజిల్ హోటల్ తో పాటు బిర్లా టెంపుల్ నుంచి ఈ గదిలోని కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలున్నాయి. అంతేకాక ఫ్లై ఓవర్ నుంచి కూడా గదిలోని కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల ఈ పరిస్థితులపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు, చంద్రబాబు కార్యాలయంపై ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు నిఘా పెట్టే అవకాశాలున్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంతేకాక చంద్రబాబుకు మరింత భద్రతను కూడా పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమృత క్యాజిల్ తో పాటు బిర్లా మందిర్ వద్ద కూడా రెండు పోలీస్ ఔట్ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు ప్రాంతాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దీంతో చంద్రబాబు భద్రత కోసం అటు ఏపీ పోలీసులతో పాటు, ఇటు తెలంగాణ పోలీసులూ చర్యలు తీసుకోనున్నారు.