: సుప్రీం నిర్ణయంతో కేంద్రానికి రూ. 10 వేల కోట్ల లాభం
అక్రమ మార్గాల్లో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కేంద్రానికి కాసుల పంట కురిపిస్తోంది. 214 బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. బొగ్గు గనులను రద్దు చేయడమే కాక టన్ను బొగ్గుకు రూ. 295 కేంద్రానికి చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయా కంపెనీలు దాదాపు రూ. 10 వేల కోట్లను కేంద్రానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాదిలో ఇప్పటికే ఆయా కంపెనీలు 50 మిలియన్ల టన్నుల బొగ్గును వెలికితీశాయని అంచనా. దీంతో ఈ బొగ్గుపై సదరు కంపెనీలు కేంద్రానికి రూ. 1,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఏళ్ల పాటుగా బొగ్గు గనులను నిర్వహిస్తున్న కంపెనీలు ఎంతలేదన్నా 300 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేంద్రానికి రూ.9 వేల కోట్ల మేర ఆదాయం రానుంది. ఇక సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనులను కొత్తగా నిర్వహించనున్న వేలం ద్వారా కేంద్రం మరింత ఆదాయాన్ని రాబట్టే అవకాశాలున్నాయి. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయంతో కేంద్ర ఖజానాకు లాభాల పంట పండనుంది.