: వెజ్ మీల్స్ లో ఎముకలు...లక్ష జరిమానా!
ట్రైన్ లో దూర ప్రయాణాలు చేస్తున్నారా? ప్యాంట్రీ కార్ లో భోజనం ఆర్డర్ చేశారా? ఎందుకైనా మంచిది మరోసారి ఆలోచించండి. ఎందుకంటే, ఈ మధ్య రైల్వేల్లోని ప్యాంట్రీకార్ సరఫరా చేస్తున్న ఆహారంలో బొద్దింకలు, వెజ్ మీల్స్ లో ఎముకలు దొరుకుతున్నాయి. తికమ్ చంద్ జైన్ (65) అనే వ్యక్తి గౌహతీ నుంచి న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్లో తరచు ప్రయాణాలు చేస్తుంటారు. సెప్టెంబర్ 19న ఢిల్లీలో రాజధాని ఎక్స్ ప్రెస్ ఎక్కి, తరువాతి రోజు వెజ్ మీల్స్ ఆర్డర్ చేశారు. తనకు సెర్వ్ చేసిన కూరలో నాన్ వెజ్ ఉన్నట్టు ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో పరీక్షిస్తే ఆయన అనుమానం నిజమైంది. అందులో ఎముకలు ఉన్నాయి. దీంతో క్యాటరింగ్ మేనేజర్ కు ఫిర్యాదు చేసి, ప్రధాన కార్యాలయానికి కూడా లిఖిత పూర్వకంగా ఆయన ఫిర్యాదు పంపారు. దీంతో రాజధాని ఎక్స్ ప్రెస్ లో కేటరింగ్ చేస్తున్న బృందావన్ ఫుడ్ వారికి రైల్వే శాఖ లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతంలో సూప్ లో బొద్దింక రాగా, అప్పుడు కూడా లక్ష జరిమానా విధించారు.