: గుండెలో బుల్లెట్ తో రెండు నెలల సహజీవనం!
శరీరంలో బుల్లెట్ దిగిందంటేనే హడలిపోయి, భయానికే ప్రాణాలు గంగలో కలిసిపోతున్న రోజులివి. అయితే భరత్ శర్మ మాత్రం గుండెలో బుల్లెట్ పెట్టుకుని రెండు నెలల పాటు నిర్భయంగా బతికేశారు. అంతేకాదు, అత్యంత శ్రమకోర్చి వైద్యులు అతడి గుండెలోని బుల్లెట్ ను తీసేసిన తర్వాత కూడా శ్వాస పీల్చి, తన గుండె ధైర్యం బుల్లెట్ లకు లొంగదని నిరూపించారు. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన 32 ఏళ్ల భరత్ శర్మ, ఓ రోజు బ్యాంకు వద్ద ఉండగా, అతడిపై దొంగలు దాడి చేశారు. తనవద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించిన దొంగలను శర్మ అడ్డుకున్నారు. ఈ క్రమంలో దొంగలు శర్మపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ నడుము భాగంలో తాకగా, రెండు బుల్లెట్ నేరుగా గుండెలోపలికి వెళ్లిపోయింది. శర్మను పరిశీలించిన వైద్యులు, గుండె ఎడమ వైపు కండరంలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లిందని తేల్చారు. రక్తం పంప్ అయ్యే ప్రతి సందర్భంలో బుల్లెట్ కదులుతోందని, ఆపరేషన్ చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. వైద్యుల మాటలకేమీ భయపడని శర్మ, ఢిల్లీ వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు అహ్మదాబాద్ వైద్యుడు అనిల్ జైన్, శర్మకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధపడ్డారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు గుండె కొట్టుకోవడాన్ని నిలిపేసిన జైన్, దిగ్విజయంగా ఆపరేషన్ ను పూర్తి చేశారు. శర్మ గుండె నుంచి బుల్లెట్ ను బయటికి తీశారు. గుండె కొట్టుకోవడాన్ని పునరుద్ధరించారు. ‘‘తమతో పాటు విధి కూడా శర్మ బతకడంలో కీలక భూమిక పోషించింది. గుండెలో బుల్లెట్ పెట్టుకుని శర్మ రెండు నెలలు బతకడమే గగనం. ఇది అత్యంత అరుదైన ఘటనే’’ అంటూ ఆపరేషన్ తర్వాత జైన్ చెప్పుకొచ్చారు.