: ఇక భారత్ కు 'మేడ్ ఇన్ ఇండియా' మెయిల్!
మరికొద్ది రోజులుంటే, ప్రభుత్వ శాఖల మధ్య సమాచార వినిమయం కోసం కొత్త మెయిల్ సర్వర్ అందుబాటులోకి రానుంది. దేశీయంగా అభివృద్ధి కానున్న ఈ మెయిల్ సర్వీసు అచ్చం జీమెయిల్, యాహూల మాదిరిగానే పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు డిజిటల్ ఇండియా కింద రూ. 1.18 లక్షల కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన మెయిల్ సేవల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నవంబర్ నాటికి ఈ కొత్త మెయిల్ సేవలకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వానికి అందనుందని సమాచారం. తొలుత కేంద్ర ప్రభుత్వ శాఖలకు అందబాటులోకి రానున్న కొత్త మెయిల్ సేవలు 2019 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ శాఖలకూ విస్తరించనుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ మెయిల్ సేవలు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదమే లేదంటున్నారు అధికారులు. ఎందుకంటే ఈ సేవలకు సంబంధించిన సర్వర్లు దేశంలోనే ఏర్పాటవుతాయట. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో వ్యాపించిన తర్వాత సామాన్య పౌరులకు కూడా ఈ సేవలు విస్తరించనున్నాయి.