: ఇదీ మన జైళ్ల తీరు... శిక్షకు వెళ్లినట్టులేదు... హాలీడేకి వెళ్లినట్టుంది!


మన దేశంలోని జైళ్లపై చాలా ఫిర్యాదులున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల తీరుపై ఫిర్యాదులకు అంతేలేదు. జైళ్లలో ఖైదీలు ఎందుకు మరణిస్తారో కారణాలు అంతుబట్టవు. పోలీసులు కఠినంగా శిక్షిస్తారా? అంటే, పెద్దగా శిక్షించరని ఖైదీలే చెబుతారు. ఓ వందో రెండొందలో ఇస్తే అద్భుతంగా చూసుకుంటారన్న ఖైదీల వ్యాఖ్యలు సర్వసాధారణం. పోలీసులు బాగా చూసుకుంటే జైళ్లలో అసాంఘిక కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? అనే దానిపై కచ్చితమైన ఆధారాలు లభించవు. మన రాష్ట్రంలోని జైళ్ల తీరు తెన్నులపై మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది. దానికి కారణం... చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ ఓ న్యాయవాదికి తరచూ ఫోన్ చేస్తూ తన బెయిల్ గురించి విసిగిస్తున్నాడు. బెయిల్ అనేది తన చేతిలో పని కాదని చెబుతున్నప్పటికీ అతను వినిపించుకోవడం లేదు. దీంతో, ఒళ్లు మండిన న్యాయవాది బెయిల్ గోల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ టీవీ ఛానెల్ ను ఆశ్రయించారు. ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేయడం... న్యాయవాది సమాధనం చెప్పడం అంతా లైవ్ టెలీకాస్ట్ అయింది. దీంతో జైళ్ల శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైలులో తనిఖీలు మరోసారి నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద ఆరు సెల్ ఫోన్లతో పాటు 50 గ్రాముల గంజాయిని ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఖైదీలకు చేరాయి? అని ఖైదీలు, సిబ్బందిని ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది. దీంతో, ఐజీ స్థాయి అధికారి జైళ్లను బాగుచేద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారంటే, అక్కడ ఏ స్థాయిలో అవినీతి ఉందో అర్ధం చేసుకోవచ్చు. జైళ్ల శాఖలో పని చేసే వార్డెన్ల దగ్గర్నుంచి, కానిస్టేబుల్ వరకు అందరూ కోట్లకు పడగలెత్తుతున్నారంటే అవినీతి తీరుతెన్నులను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జైళ్లలో అవినీతి జరిగే తీరుపై ఖైదీలు చెప్పే మాటలేంటంటే... జీవిత ఖైదు పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సీనియర్ కాగా, కొత్తగా జైలులో అడుగుపెట్టే వాళ్లంతా అతని బాధితులు. అతనిని అందరూ మేస్త్రీ అని పిలుస్తారు. సాధారణంగా కఠినమైన నేరాలు చేసిన వారంతా మేస్త్రీలుగా ఉంటారని ఓ ఖైదీ వ్యాఖ్య. అతను పోలీసులు అప్పగించిన పనులన్నీ ఇతరులతో చేయిస్తుంటాడు. ఎవరైనా ఎదురు తిరిగితే అతనిపై దాడి జరుగుతుంది. చర్లపల్లిలోని ఒక్కో బ్యారక్ లో సుమారు 50 నుంచి 60 మంది ఖైదీలు ఉంటారని సమాచారం. అక్కడ ఖైదీలు గ్రూపులుగా ఏర్పడతారు. సీనియర్లు జైలు సిబ్బందితో స్నేహంగా మెలిగి తమకు కావాల్సిన సౌకర్యాలు పొందుతారు. ఎవరైనా ఖైదీ సెల్ ఫోన్ వాడాలంటే సీనియర్ ఖైదీలకు 10,000 రూపాయల డిపాజిట్ చేయాలి. అలా డిపాజిట్ చేస్తే ఫోన్ వాడొచ్చు. పొరపాటుగా ఫోన్ వాడితే, ఆ ఖైదీ కుటుంబ సభ్యులకు వెంటనే ఫోన్ కాల్ వెళుతుంది. '50 వేలు రెడీ చేయండి లేదా మీ వాడు జైల్లోనే..!' అంటూ బెదిరింపులు ప్రారంభమవుతాయని జైలు నుంచి విడుదలైన ఖైదీలు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News