: ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లోకి ఎందుకు వెళుతున్నారంటే...!
మెట్రో వివాదం చినికి చినికి గాలివానలా మారి తెలంగాణ టీడీపీని కుదిపేసింది. రాజకీయవర్గాల కథనం ప్రకారం, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారం టీటీడీపీలో ఎర్రబెల్లికి, రేవంత్‌రెడ్డికి మధ్య అగాధాన్ని పెంచింది. హైదరాబాద్ కు ప్రతిష్ఠాత్మకమైన మెట్రోరైల్ ప్రాజెక్ట్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తోందంటూ రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ప్రాజక్టుకు నష్టం కలిగించేలా మెట్రో భూములను అక్రమంగా మైహోమ్స్ అధినేత రామేశ్వర రావుకు కేటాయించిందని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు ఎర్రబెల్లి దయాకర్ రావుకు బంధువు, అత్యంత సన్నిహితుడు. దీంతో, మెట్రో భూముల విషయంలో రేవంత్ దూకుడు తగ్గించేలా చూడాలని చంద్రబాబును పలుమార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. అయితే, ఈ విషయంలో ఎర్రబెల్లి అభ్యంతరాలను తోసిపుచ్చి, రేవంత్ రెడ్డికి చంద్రబాబు పూర్తి మద్దతుగా నిలబడ్డారు. దీంతో, ఎర్రబెల్లి కొద్ది రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో రేవంత్ రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యత, చంద్రబాబు ఇస్తున్న ఊతం కూడా ఆయనను అసహనానికి గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ కారణాలతోనే, టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లాలని ఎర్రబెల్లి నిశ్చయించుకున్నారని సమాచారం.