: 'బక్రీద్ నాడు శాకాహారం తినండి' అన్నందుకు 'పెటా' కార్యకర్తలను చితకబాదారు!
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో 'పెటా' కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. బక్రీద్ సందర్భంగా ముస్లింలు శాకాహారం స్వీకరించాలని, జంతువధ చేయరాదని కొందరు పెటా కార్యకర్తలు ప్రచారం చేయగా, ఆగ్రహించిన స్థానికులు వారిపై దాడి చేశారు. 'పెటా' ఉద్యమకారిణి బెనజీర్ సురయ్యా నేతృత్వంలో కొందరు వలంటీర్లు నగరంలోని తాజ్-ఉల్-మసీద్ వద్ద ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. సురయ్యా పచ్చని ఆకులను కలిగి ఉన్న చున్నీ ధరించి శాకాహారం ప్రాధాన్యతను చాటే ప్రయత్నం చేశారు. 'పెటా' ప్రచారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్ళిపోవాలని ప్రతి నినాదాలు చేశారు. అయినా సురయ్యా బృందం వెనక్కి తగ్గకపోవడంతో వారు దాడికి దిగారు. దొరికినవాళ్ళను దొరికినట్టు చితకబాదారు. మహిళలన్న కనికరం కూడా లేకుండా తమ ప్రతాపం చూపారు. దీంతో, ఆ ఉద్యమకారులు తలో దిక్కుకు పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ కొద్దిసంఖ్యలో ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. అనంతరం, నగర పోలీస్ కమిషనర్ సునీల్ పాటిహార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. సురయ్యాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిపై స్థానికుడు నవీద్ ఖాన్ మాట్లాడుతూ, 'పెటా' కార్యకర్తలు తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారని, తమ మతంపై నేరుగా దాడి చేసే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.