: తెలంగాణ రైతులకు శుభవార్త... లక్ష రుణమాఫీ ఆదేశాలు జారీ
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్న రైతు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. లక్ష రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీపై మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను ఆమోదించిన సీఎం 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతగా 4,250 కోట్ల రూపాయల విడుదలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రైతులకు ఊరట కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు రుణాలను బ్యాంకులు రెన్యూవల్ చేస్తాయని, పంట బీమా సౌకర్యం కోల్పోకుండా తొందరగా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రుణమాఫీపై రేపు మంత్రి వర్గ ఉపసంఘం బ్యాంకర్లతో భేటీ కానుంది.