: విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం తగ్గుతోంది: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం


రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ఆదాయం తగ్గిపోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలియజేసింది. విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన చాలా వాణిజ్య సంస్థలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళుతున్నాయని పేర్కొంది. విభజన తర్వాత వాణిజ్య రంగానికి చెందిన దాదాపు మూడు వేల మంది డీలర్లు తమ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కు మార్చుకున్నారని తెలిపింది. అలాగే, విభజన తర్వాత హైదరాబాద్‌కు రాకపోకలు క్రమంగా తగ్గిపోతున్నాయనీ, దీని ప్రభావం పెట్రోలియం ఉత్పత్తుల మీద, ఇతర అమ్మకాల మీద పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో ఆర్థిక సంఘానికి వివరించింది. ఈ రెండు కారణాల వల్ల, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వ్యాట్ పన్నులతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహన పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిందని ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ కు భారీ ఆదాయం వస్తోందన్న ప్రచారం వాస్తవ దూరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ కు ఆదాయం క్రమంగా తగ్గుతోందన్న విషయంతో పాటు, రాష్ట్రానికి జిల్లాల నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉందని తెలియజేసింది. తెలంగాణలోని పదిజిల్లాల్లో ఎనిమిది జిల్లాలు కరవు పీడిత ప్రాంతాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణాల రీత్యా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందేలా చూడాలని 14వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్యం అభ్యర్థించింది.

  • Loading...

More Telugu News