: బ్రాందీ సీసాలో పురుగు... యూఎస్ఎల్ సంస్థకు జరిమానా
తాను కొనుగోలు చేసిన బ్రాందీ సీసాలో పురుగు ఉందని న్యాయపోరాటం చేశాడో చెన్నై వాసి. రెండేళ్ళ క్రితం జి.రమేశ్ అనే వ్యక్తి ప్రభుత్వ మద్యం దుకాణంలో బ్రాందీ బాటిల్ కొనుగోలు చేయగా, దాంట్లో చచ్చిన పురుగును గుర్తించాడు. దీనిపై, సదరు మద్యం తయారీదారు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) కు రమేశ్ లీగల్ నోటీసు పంపాడు. అయితే, అది వర్కౌట్ కాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై, స్పందించిన యూఎస్ఎల్ తమ ఉత్పత్తులను కఠిన ప్రమాణాలకు లోబడి తయారుచేస్తామని, మద్యం సీసాలో ఇతర వస్తువులు ఉండడం అసాధ్యమని చెబుతూ, ఆ ఫిర్యాదును కొట్టివేయాలని కోరింది. ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు వి.గోపాల్ మాట్లాడుతూ, బాటిల్ లోకి పురుగు ఎలా వచ్చిందన్న విషయమై స్పష్టత లేదన్నారు. యూఎస్ఎల్ సంస్థ వివరణ సరిగా లేదని, రమేశ్ కు రూ.55,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఇలాంటి మద్యం తాగితే అస్వస్థత పాలవుతారని ఆయన పేర్కొన్నారు.