: ఎయిర్ సెల్-మాక్సిస్ డీల్ లో ఎలాంటి అతిక్రమణ లేదు: చిదంబరం
2జీ కుంభకోణంలో భాగమైన ఎయిర్ సెల్-మాక్సిస్ మధ్య కుదిరిన ఒప్పందానికి ఎఫ్ఐపీబీ జారీ చేసిన అనుమతి విషయంలో ఎలాంటి పొరపాటు జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ఎయిర్ సెల్ -మాక్సిస్ మధ్య నిధుల ప్రవాహానికి ఎఫ్ఐపీబీ అనుమతి జారీలో తన పాత్రను సీబీఐ తన చార్జీషీట్ లో ప్రస్తావించిన విషయంపై చిదంబరం శుక్రవారం రాత్రి స్పందించారు. "ఎఫ్ఐపీబీ అధికారులు నా ముందు పెట్టిన సదరు ఫైలుపై సంతకం చేశాను. ఈ ఒప్పందంలో నిబంధనల మేరకే అధికారులు నా అనుమతి తీసుకున్నారు. అదనపు కార్యదర్శితో పాటు కార్యదర్శి కూడా సదరు ఫైలును క్లియర్ చేసిన తర్వాతే నా ముందు పెడతారు. ఇదంతా సర్వసాధారణంగా జరిగేదే" అని ఆయన వివరణనిచ్చారు.