: కేంద్రం నుంచి భారీగా నిధులు ఇప్పించండి: 14వ ఆర్థిక సంఘానికి కేసీఆర్ వినతి


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్ ఈరోజు 14వ ఆర్థిక సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా... మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పథకాలను వివరిస్తూ... పేదరిక నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని తెలిపారు. బీసీల అభివృద్ధికి 20 వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రభాగాన ఉందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల ఎకరాల ఖాళీ భూములను ఇప్పటికే గుర్తించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులను అనుసంధానం చేసి ఇంటింటికీ తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయడం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టామని... సమగ్ర సర్వే విజయవంతమైందని అన్నారు. హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటుతామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆయన 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు.

  • Loading...

More Telugu News