: తనలో పాకిస్థానీ రక్తం ప్రవహిస్తోందంటున్న సొనమ్
బాలీవుడ్ యువతార సోనమ్ కపూర్ తనలో పాకిస్థానీ రక్తం ప్రవహిస్తోందని పేర్కొంది. తన నానాజీ (తాతయ్య-తల్లి తరపు), దాదాజీ (తాతయ్య-తండ్రి తరపు) పాక్ లోని పెషావర్ కు చెందిన వారని ఆమె తెలిపింది. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ తో జంటగా సోనమ్ నటించిన 'ఖూబ్ సూరత్' చిత్రం ప్రచారంలో భాగంగా భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అత్తారీలో సినిమా యూనిట్ పర్యటించింది. ఈ సందర్భంగా సోనమ్ పాక్ సైనికులతో కరచాలనం చేసి మురిసిపోయింది. ఆమె మాట్లాడుతూ, ఓ సారి పాకిస్థాన్ వెళ్ళాలని ఉందని తన ఆకాంక్షను వెల్లడించింది. పాక్ భూభాగంలోకి అడుగుపెట్టేందుకు అనుమతించాలని సైనికులను అడిగానని, అయితే, వారు నిరాకరించారని ఈ బక్కపల్చని భామ తెలిపింది. సోనమ్ కపూర్ బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరో అనిల్ కపూర్ తనయ అన్న సంగతి తెలిసిందే.