: మైక్రోసాఫ్ట్ లో రెండో విడత ‘కోత’!
సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అదనపు సిబ్బందిని వదిలించుకునే క్రమంలో రెండోసారి కోతలకు తెర లేపింది. ఇందులో భాగంగా సిలికాన్ వ్యాలీలోని పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని మూసేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం సంస్థ ఉద్యోగుల మధ్య చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లను సంస్థ ధ్రువీకరించింది. ఈ చర్య ద్వారా కేవలం 50 ఉద్యోగాలు మాత్రమే రద్దు కానున్నాయి. సంస్థ కొత్త ఉత్పత్తులపై పరిశోధనలు సాగించే ఈ విభాగంలోని సిబ్బంది సంస్థ ప్రధాన కార్యాయానికి బదిలీ కానున్నారు. ఈ కోతల తర్వాత కూడా సిలికాన్ వ్యాలీ క్యాంపస్ లో గూగుల్ కంటే తామే అధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. తెలుగు తేజం సత్య నాదెళ్ల సంస్థ పగ్గాలు చేపట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ లో మొదలైన సంస్కరణల పర్వం ఇంకా కొనసాగనుంది. దాదాపు 18,000 ఉద్యోగాలకు కోత పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ తీర్మానించిన సంగతి తెలిసిందే.