: 'ఈటీ' అవార్డుల ఎంపిక కమిటీకి సత్య నాదెళ్ల నేతృత్వం


ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక అవార్డుల ఎంపిక కమిటీకి మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల నేతృత్వం వహించనున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ పగ్గాలను భుజానికెత్తుకున్న సత్య నాదెళ్ల, తెలుగు నేల కీర్తి పతాకను ఎగురవేసిన సంగతి తెలిసిందే. భారత వాణిజ్య, వ్యాపార రంగంలో ఎకనామిక్ టైమ్స్ అవార్డులు పేరెన్నికగన్నవి. ఈ అవార్డుల ఎంపిక కమిటీలో దేశంలోని ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు ఉంటున్నారు. ఈ ఏటి అవార్డుల ఎంపిక కమిటీకి నేతృత్వం వహించేందుకు సత్య నాదెళ్ల దాదాపుగా అంగీకరించినట్లు సమాచారం. కమిటీలో పారిశ్రామిక దిగ్గజాలు కేవీ కామత్, కుమార మంగళం బిర్లా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతీ భట్టాచార్య, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ, ప్రముఖ న్యాయ కోవిదుడు హరీశ్ సాల్వే లున్నారు. ఈ కమిటీ ఈ నెల 29న తొలి భేటీ నిర్వహించనుంది.

  • Loading...

More Telugu News