: వీటిని తిని చూడండి... శక్తి విషయంలో దేనికీ తీసిపోవు!
గోధుమలు, బార్లీ గింజలు, రాగులు... ఇలా, బలం కోసం ఎన్నో ధాన్యాలను తీసుకోవాలని చెబుతారు వైద్యులు. ఇప్పుడు వాటి స్థానాన్ని ఓ చిరు ధాన్యం ఆక్రమించేందుకు సిద్ధంగా ఉంది. అవిసెలు తెలుసు కదా..! దోస గింజల సైజులో కాఫీ రంగులో ఉంటాయి. ఇటీవల కాలంలో ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సంపూర్ణ పోషకశక్తి పరంగా చూస్తే దీన్నో 'పవర్ హౌస్' అని చెప్పుకోవచ్చు. రుచికరమే కాదు, ఆరోగ్యదాయకం కూడా. అందుకే, నేటి తరం డాక్టర్లు వీటిని ఎక్కువగా సూచిస్తున్నారు. ఈ అవిసెల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి ఈ ఫ్యాటీ ఆసిడ్లు ఎంతో ముఖ్యమైనవి. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ లో లిగ్నాన్ పదార్థం ఉంటుంది. ఈ లిగ్నాన్ అవిసెల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. మ్యూసిలేజ్ కు ఈ తృణ ధాన్యం మంచి వనరు. మ్యూసిలేజ్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా పేగులు పోషక పదార్థాలను సరైన రీతిలో గ్రహించగలుగుతాయి. అంతేగాకుండా, వీటిలో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ రక్తనాళాల వాపును అరికడుతుంది. క్రమం తప్పకుండా అవిసెలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ గా భావించే 'లో డెన్సిటీ లైపోప్రొటీన్' (ఎల్ డీ ఎల్) స్థాయి తగ్గి, మంచి కొలెస్ట్రాల్ గా పరిగణించే హై డెన్సిటీ లైపోప్రొటీన్ (హెచ్ డీ ఎల్) స్థాయి పెరుగుతుందట. యాంటీ ఆక్సిడాంట్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ యాంటీ ఆక్సిడాంట్లు ఎంతో అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా, అవిసెలు బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలని భావించే వారికి అవిసెలు వరం అని భావించవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైగా కొవ్వు దరిచేరదు. వీటిలోని ఫ్యాటీ ఆసిడ్ల కారణంగా మేని నిగారింపుతో పాటు శిరోజాలు ఆరోగ్యకరంగా తయారవుతాయి. ఈ అవిసెలను రోజూ తీసుకంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.