: నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా చేస్తారు?: పోప్ నిర్ణయంపై వ్యతిరేకత


క్యాథలిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ తీరుపై వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. క్యాథలిక్కు చర్చి నిబంధనలకు వ్యతిరేకంగా పోప్ ఫ్రాన్సిస్ పునర్వివాహాలకు ఆమోదం పలకడాన్ని ఐదుగురు కార్డినళ్లు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు. క్యాథలిక్కు చర్చి నిబంధన ప్రకారం భార్యకు విడాకులివ్వడం, పునర్వివాహం చేసుకోవడం తప్పు. అలాంటి తప్పు చేస్తే మత కార్యక్రమాలకు వారిని దూరంగా ఉంచుతారు. ఇది తరాలుగా వస్తున్న ఆచారం. దీనిని పోప్ ఫ్రాన్సిస్ మారుస్తూ నిర్ణయం తీసుకోవడంపై పెను దుమారం రేగుతోంది. పునర్వివాహాలను ఆమోదిస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే, పోప్ శ్రీలంక దేశపు తొట్టతొలి క్రైస్తవ మిషనరీ బిషప్ గియోసెప్పీ బాజ్ కు సెయింట్ హుడ్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ఎవరికైనా సెయింట్ హుడ్ ఇవ్వాలంటే వారి పేరిట సైన్సుకు అందని మహిమలు రెండు జరగాలి. దానిని నిర్థారణ చేసుకునేందుకు ఏర్పాటైన కమిటీ శల్యపరీక్షలు చేస్తుంది. వాటికి నిలబడి నిగ్గుతేలితేనే వారికి సెయింట్ హుడ్ ఇస్తారు. అలాంటిది బాజ్ పేరిట ఒక మహిమ మాత్రమే రుజువైంది. అలాంటి నేపథ్యంలో ఆయనకు సెయింట్ హుడ్ ఎలా ఇస్తారంటూ కార్డినళ్లు పోప్ ను ప్రశ్నిస్తున్నారు. కుటుంబ వ్యవస్థపై జరగనున్న కీలక సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని క్యాథలిక్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News