: దారుణం... ఇలా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు!
స్విట్జర్లాండ్లో ఓ సాకర్ జట్టు గోల్ కీపర్ మంచినీళ్ళ బాటిల్లో మూత్రం నింపారు ప్రత్యర్థి జట్టు అభిమానులు. ఆ విషయం తెలియని గోల్ కీపర్ ఆ మూత్రాన్ని తాగేశాడు. జ్యూరిచ్ లో లోయర్ డివిజన్ టైర్ 3 మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎఫ్ సీ మూరి జట్టు గోల్ కీపర్ రెటో ఫెల్డర్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎఫ్ సీ బాడెన్ తో మ్యాచ్ సందర్భంగా ఫెల్డర్ గోల్ పోస్ట్ వద్ద బిజీగా ఉన్నాడు. పోస్టు వెనుక అతని మంచినీళ్ళ బాటిల్ ఉంది. దాహం వేసి బాటిల్ అందుకుని గడగడా తాగిన ఫెల్డర్ ఇబ్బందికరంగా ముఖం పెట్టాడు. రుచి మారడంతో అతనికి అనుమానం వచ్చింది, తీరా చూస్తే అవి నీళ్ళు కావు, మూత్రం! ఫెల్డర్ ఆ బాటిల్లోని మూత్రం తాగిన వెంటనే స్టాండ్స్ లోని ప్రత్యర్థి జట్టు ఫ్యాన్స్ 'ఇక నీకు ఎయిడ్స్ వస్తుంది' అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఎఫ్ సీ మూరి కోచ్ మాట్లాడుతూ, ఎంతో సాకర్ ఆడానని, పెద్ద ఎత్తున అనుభవం సంపాదించుకున్నానని, కానీ, ఎక్కడా ఇలాంటి ఘటన జరగడం చూడలేదన్నారు. ఫ్యాన్స్ ఆకతాయి చేష్ట అందరినీ నివ్వెరపరిచిందన్నారు. ఘటనపై ఎఫ్ సీ బాడెన్ అధ్యక్షుడు థోమి బ్రామ్ మాట్లాడుతూ, గోల్ కీపర్ ఫెల్డర్ కు క్షమాపణలు తెలిపారు. అంతర్గత విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. కాగా, ఆ పోకిరీ ఫ్యాన్స్ బాల్ బాయ్ ద్వారా గోల్ కీపర్ ఫెల్డర్ మంచినీళ్ళ బాటిల్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.