: మెట్రో పనులు ఎక్కడా ఆగలేదు... సకాలంలో పూర్తి చేస్తాం: ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు నిలిచిపోనున్నాయంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను ఎల్ అండ్ టీ ఎండీ వీబీ గాడ్గిల్ కొట్టివేశారు. మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగుతుందని చెప్పారు. అయితే, ఈ నెల 10న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమేనన్న గాడ్గిల్, అది నేరం కాదన్నారు. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని చెప్పిన ఆయన, ప్రభుత్వం- ఎల్ అండ్ టీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని అన్నారు. సుదీర్ఘకాలం నడిచే పెద్ద ప్రాజెక్టులున్నప్పుడు సమస్యలు, అవాంతరాలు సహజమని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో గాడ్గిల్ మాట్లాడారు. మెట్రో మార్గంలో మార్పులపై ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.