: ఎల్ అండ్ టీ చేతులెత్తేయడానికి కారణాలివిగో...!


ఎల్ అండ్ టీ మేనేజింగ్ డైరెక్టర్ వీబీ గాడ్గిల్ హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి రాసిన లేఖలో మెట్రోరైల్ నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన కారణాలను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు... 1. అనుమతులు, ఆమోదాలు లభించకుండానే నిర్మాణం ప్రారంభించామన్న హెచ్ ఎమ్మార్ఎల్ (హైదరాబాద్ మెట్రోరైల్) ఆరోపణలను ఎల్ అండ్ టీ ఖండించింది. అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే తాము పనులు ప్రారంభించామని స్పష్టం చేసింది. ప్రభుత్వం తమకు వందశాతం రైట్ ఆఫ్ ది వే (మెట్రో రైల్ నిర్మాణానికి అవసరమైన ఆస్తులు, భూములు అప్పగించడం) అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చిన ఉప్పల్ డిపో, నాగోల్ మెట్టుగూడ మార్గంలో ఎంతవేగంగా పనులు చేశామో చూడాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అనుమతులు ఇవ్వకుండా తమను నిందించడం సరికాదని తేల్చి చెప్పింది. అలైన్ మెంట్ మార్పుపై చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు తమకు స్పష్టమైన సమాచారం అందలేదని పేర్కొంది. 2. రాష్ట్రాన్ని విభజిస్తారని, హైదరాబాద్‌ స్థాయి మారుతుందని తాము ఊహించలేదని ఎల్ అండ్ టీ సంస్థ తన లేఖలో పేర్కొంది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కుదిరిన తర్వాత.... 2010 డిసెంబర్‌ 30వ తేదీన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించింది. కమిటీ ఆరు పరిష్కార మార్గాలు సూచించింది. వాటిలో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నది కూడా ఒకటి. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా... హైదరాబాద్‌కు కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పించి, దీన్ని ఉమ్మడి రాజధాని చేస్తారని అప్పట్లో అందరూ అన్నారని... అందువల్ల రాష్ట్రం విడిపోయినా ప్రాజెక్టుకు ఇబ్బంది ఉండదని, హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా... రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని భావించే ఈ బిడ్‌కు తమ సంస్థ ముందుకొచ్చిందని ఎల్ అండ్ టీ పేర్కొంది. 3. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో అవకాశాలు తగ్గినట్లేనని ఎల్ అండ్ టీ తన లేఖలో పేర్కొంది. విభజనకు ముందు హైదరాబాద్‌ మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాజధాని. సమైక్య రాష్ట్రం అనేక జిల్లాలు, వనరులు, ఓడరేవులకు నిలయం. అప్పట్లో వీటన్నిటికి హైదరాబాదే కేంద్రం. ఇప్పుడు హైదరాబాద్‌ వనరులు అంతగా లేని చిన్న రాష్ట్రానికి రాజధాని. హైదరాబాద్ నగర ఆర్థిక వనరులు ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే బాగా తగ్గాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కావల్సిన ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ పరిస్థితుల్లో... విభజన వల్ల ఏర్పడిన పోటీ వల్ల హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రైవేటు రంగం నుంచి వచ్చే పెట్టుబడులు తగ్గుతాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ స్థాయి గణనీయంగా పడిపోవడం వల్ల...ఇక్కడ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోతుంది. హైదరాబాద్‌ స్థితిగతులు మారిపోవడం వల్ల మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థిక మనుగడపై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్ అండ్ టీ వివరించింది. 4. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా హైదరాబాద్‌ కు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తాము మెట్రో ప్రాజెక్టు చేపట్టామని ఎల్ అండ్ టీ పేర్కొంది. కానీ... విభజన తర్వాత, హైదరాబాద్‌ ప్రాధాన్యం తగ్గిందని తెలిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, హైదరాబాద్‌ నగరానికి ఉన్న ప్రాధాన్యం, దీని ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ప్రాధాన్యాలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తాము మెట్రో రైలు ప్రాజెక్టుకు బిడ్‌ వేశామని తెలిపింది. హైదరాబాద్‌ నగరానికి అంతకుముందున్న స్థాయిలోనే ప్రాధాన్యం ఉంటే ప్రాజెక్టు మనుగడ చాలా బాగుండేదని అభిప్రాయపడింది. ఎందుకంటే, ప్రాజెక్టు ఆదాయ మార్గాల్లో రియల్‌ ఎస్టేట్‌ కూడా చాలా ప్రధాన భూమిక పోషిస్తుందని... కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రాజెక్టు మనుగడ సాధించడం సాధ్యం కాదని తాము పలుమార్లు ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపింది. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ అందించడం మెట్రో రైలు ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి అయినప్పటికీ... ఈ ప్రాజెక్టు మనుగడకు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కూడా ప్రధాన అంశమని ఎల్ అండ్ టీ పేర్కొంది. వీటితో పాటు ఇంకా అనేక కారణాలను వివరిస్తూ హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేసుకోవాలని ఎల్ అండ్ టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కీలక దశలో ఉన్న మెట్రోరైల్ ను పూర్తిచేయడం అత్యవసరమని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News