: సినిమాల్లో నటిస్తే ఎంత అభిమానమో... రాజకీయాల్లో మంచి పని చేసినా అంతే అభిమానం!: బాబు
హైదరాబాదులో జరుగుతున్న 'రౌడీఫెలో' ఆడియో వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా రోహిత్ సినిమా కనుక ఇంత సేపు వెచ్చించా'నని అన్నారు. రౌడీఫెలో సినిమా నిర్మాతకు డబ్బులు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. సినిమాలో హీరోయిన్ విశాఖ సింగ్ బాగా నటించారని విన్నానని ఆయన తెలిపారు. హీరో రోహిత్ కు ఇది ఏడో సినిమా అని చెప్పిన ఆయన, ఏడేళ్ల క్రితం ఇదే రోజున రోహిత్ తొలి సినిమా వేడుక జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. నెగిటివ్ పేరుతో పాజిటివ్ సినిమా తీసిన దర్శకుడు అభినందనీయుడని ఆయన అభినందించారు. అభిమానులను చూస్తుంటే మరో లోకంలో ఉన్నాననిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లో నటిస్తే ఎంతటి అభిమానం సంపాదించుకోవచ్చో, రాజకీయాల్లో మంచి పని చేసినా అలాగే పొందచ్చని చంద్రబాబు అన్నారు. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తల అభిమానం మరువలేనిదని బాబు పేర్కొన్నారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు ఎన్టీఆర్ నిలిచి ఉంటారని ఆయన తెలిపారు. సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా ఆయన చరిత్ర సృష్టించారని అన్నారు. టీడీపీ తెలుగువారి కోసం, పేదల సంక్షేమం కోసమేనని ఆయన ప్రకటించారు. ఆసుపత్రులను తగ్గించాలంటే సినిమాలు ఉండాలని ఆయన చమత్కరించారు. అభిమానుల ఆనందం చూస్తుంటే తనకు ముచ్చటగా ఉందని, ఇంకో రెండు మూడు గంటలు అభిమానుల మధ్య ఉండాలని ఉందని ఆకాంక్షించారు. కానీ కర్తవ్యం తనను తరుముతోందని, రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయని తెలిపారు. నారా రోహిత్ మంచి సినిమాలు ఎంచుకుంటూ తన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ధరించిన పాత్రలు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. రౌడీ ఫెలో హిట్టవుతుందని ఆయన తెలిపారు.