: మావోయిస్టు గణపతి... పది మంది దావూద్ ఇబ్రహీంలకు సమానమట!


అవును... ఇది నిజంగా నిజం! తెలుగు వాడైన ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి... మావోయిస్టు టాప్ బాస్. కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కంటే పదింతలు ప్రమాదకరమైన వాడట. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గణపతి ఆచూకీకి కేంద్రం, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆఫర్ చేస్తున్న నజరానా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. అయితే, గణపతి ఆచూకీ చెబితే లభించే మొత్తం రూ.2.52 కోట్లట. మరి దావూద్ ఇబ్రహీం కంటే గణపతి పది రెట్ల మేర ప్రమాదకరమైన వాడే కదా! మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు, వారి తలలపై రివార్డులను ఏటా పెంచుతూ పోతున్నాయి. ఈ క్రమంలో గణపతి తలపై రూ. 49 లక్షల రివార్డును ప్రకటించిన మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు, ఇటీవల ఈ విలువను ఒకేసారి రూ.1 కోటికి పెంచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణపతి ఆచూకీ కోసం రూ.25 లక్షల నజరానాను ప్రకటించింది. జార్ఖండ్ రూ. 12 లక్షలు, జాతీయ దర్యాప్తు సంస్థ రూ.15 లక్షల మేర నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు ప్రకటించిన నజరానాతో కలిపితే గణపతి తలకు ప్రభుత్వం కట్టిన వెల రూ.2. కోట్ల పైచిలుకే కదా. అంటే, గణపతి ఆచూకీ చెప్పిన వ్యక్తికి ఆయా ప్రభుత్వాలు ఈ మేర మొత్తాన్ని ముట్టజెబుతాయి. గణపతే స్వయంగా లొంగిపోయినా, ఆయనకే ఈ మొత్తం చేరుతుంది. అయితే దావూద్ తలపై ప్రకటించిన మొత్తం మాత్రం అతడు లొంగిపోయినా అతడికి లభించదులెండి. ఎందుకంటే అతడు కరడుగట్టిన ఉగ్రవాది, మాఫియా డాన్ కదా. గణపతి అలాంటి ఉగ్రవాది కాకున్నా, ఆయన తలకు ప్రభుత్వాలు ఈ మేర భారీ వెల కట్టడం నిజంగా ఆశ్చర్యమే.

  • Loading...

More Telugu News