: తొలిరోజే 40 లక్షల 'ఐఫోన్-6'లు అమ్ముడుపోయాయి!


యాపిల్ ఐఫోన్ లంటే విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంత పెద్ద ఎత్తున వినియోగదారులు ఎగబడతారని యాపిల్ కూడా ఊహించలేదు. ఎందుకంటే, యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్-6 కావాలంటూ తొలి 24 గంటల్లోపే 40 లక్షల మంది ఆర్డర్లు జారీ చేశారు. ఈ నెల 9న ఐఫోన్ 6 ను రెండు వెర్షన్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన యాపిల్, సోమవారం ఆన్ లైన్ లో ఆర్డర్లను స్వీకరించనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. యాపిల్ ప్రకటన వెలువడటానికి ముందే యాపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ అభిమానులు క్యూలు కట్టిన నేపథ్యంలో ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్ లకు తెరలేచింది. సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రీ బుకింగ్ లు 24 గంటలు గడిచేలోగా 40 లక్షలను దాటిపోయింది. ప్రీ బుకింగ్ లను నమోదు చేసిన వినియోగదారులకు ఐఫోన్ 6 లు శుక్రవారం నుంచి బట్వాడా కానున్నాయి. అంచనాలను మించి ప్రీ బుకింగ్ లు వచ్చిన నేపథ్యంలో తొలి రోజు బుక్ చేసుకున్న అందరికీ ఐఫోన్ 6లు చేరేందుకు అక్టోబర్ నెల దాకా సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక శుక్రవారం నుంచి యాపిల్ స్టోర్లలో ఐఫోన్ 6 లు అందుబాటులోకి రానున్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిన వినియోగదారులకు ఐఫోన్ 6లను యాపిల్ విక్రయించనుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే యాపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ ప్రియులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News