: 'తమాషా' కేసులో ఇరుక్కున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ ది వినూత్న శైలి. వారు ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తూనే ఉంటారు. మొన్ననే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత సర్కార్ సంక్షేమ పథకాలనే విమర్శించి అందరూ అవాక్కయ్యేలా చేశారు. మధ్యాహ్నభోజన పథకమే సరిగ్గా అమలు చేయలేకపోతున్నప్పుడు... ఇక అన్న క్యాంటీన్లు ఎందుకు? అంటూ సాక్షాత్తూ సొంత ప్రభుత్వంపైనే ఆయన దాడి చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో ఇరుకున్నారు. మూడురోజుల క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏటీఎంకు తాళాలు వేసి ఇంటికి తీసుకొచ్చేశారు. దీంతో విషయం తెలిసిన ఎస్ బీ ఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ బ్యాంకు సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. జేసీ తిట్లతో అవాక్కయిన చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మునిసిపాలిటీ అభివృద్ధికి విరాళం ఇవ్వలేదని ఎమ్మెల్యే తమను దూషించారని... తనతో పాటు బ్యాంకుకు కూడా జేసీ బ్రదర్స్ నుంచి భద్రత కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు అనేక తర్జనభర్జనలు పడి చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసును నమోదు చేసుకున్నారు.