: హెల్మెట్ లేదని భార్యకే ఫైన్ రాసిన ట్రాఫిక్ ఎస్సై
ఉత్తరప్రదేశ్ లో ఓ ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్ తన నిబద్ధతతో పదుగురికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్ పట్టణంలోని మధుసూదన్ చౌదరి క్రాసింగ్ వద్ద సదరు ట్రాఫిక్ ఎస్సై విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో, అతని భార్య ద్విచక్రవాహనంపై అటుగా వచ్చింది. కంప్యూటర్ మరమ్మతు చేయించుకోవడానికి ఆమె అటుగా వెళుతోంది. అయితే, హెల్మెట్ లేకపోవడంతో భార్యను ఆపిన ట్రాఫిక్ ఎస్సై, ఆమె ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ కూడా విరిగిపోయి ఉన్నట్టు గుర్తించాడు. రెండింటికీ కలిపి జరిమానా రాసి తన నిబద్ధతను చాటుకున్నాడు. దీనిపై ఆ ఎస్సై మాట్లాడుతూ, సమాజంలో మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని పేర్కొన్నాడు.