: మణిపూర్ నిట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత
మణిపూర్ లోని నిట్ లో సోమవారం ఉదయం కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మణిపూర్ విద్యార్థులు తమపై ఎక్కడ దాడి చేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఆదివారం మణిపూర్ విద్యార్థులు, స్థానికులు జరిపిన దాడుల్లో పలువురు తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసు బాసులు మణిపూర్ పోలీసులతో మాట్లాడారు. ఈ క్రమంలో నిట్ క్యాంపస్ లో భారీగా సీఆర్ పీఎఫ్ బలగాలు మోహరించాయి. అయినా, మణిపూర్ విద్యార్థులు ఏమాత్రం శాంతించిన పరిస్థితి కనిపించలేదు. సాక్షాత్తు మణిపూర్ సీఎం క్యాంపస్ ను సందర్శించినా, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అక్కడి పోలీసులు మణిపూర్ విద్యార్థులకే వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఇంకా భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గదుల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, ఇక్కడి పోలీసు అధికారులను మణిపూర్ కు పంపుతున్నారు. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.