: కొత్తజిల్లాలు అంటూ తేనెతుట్టను కదిపిన టీఆర్ఎస్ సర్కార్...భద్రాచలంలో ప్రత్యేక జిల్లా ఉద్యమం
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన అయ్యేవరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ... లీకు వార్తలు పెను దుమారాన్నే లేపాయి. ఎక్కడికక్కడ తమ ప్రాంతాన్నే జిల్లా చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే వనపర్తి, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లా డిమాండ్ ఊపందుకోగా...తాజాగా భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న కొత్తగూడెం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి అనధికార సమాచారం అందడంతో భద్రాచలంలో కొత్త జిల్లా ఏర్పాటుకు ఉద్యమం ప్రారంభమైంది. జిల్లా హోదా భద్రాచలానికే దక్కాలంటూ భద్రాచలం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భద్రాచలం అభివృద్ధిలో బాగా వెనుకబడిందని... కాబట్టి తమ ప్రాంతాన్నే ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ తో... ఈ ప్రాంత వాసులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. భద్రాచలంను జిల్లా చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇప్పటికే సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.